
ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు
మన్ననూర్: విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని డీఈఓ రమేశ్‌కుమార్ సూచించారు. శనివారం మన్ననూర్‌లోని గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థులు శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో న్యాప్‌కిన్స్ తయారీ వివరాలను డీఈఓ తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ బాలకిషన్ ఉన్నారు.