
గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ
మన్ననూర్: గిరిజన సంక్షేమశాఖ, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో డీడీయూ–జీకేవై తెలంగాణ పథకం కింద గ్రామీణ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆర్డ్‌వేర్ అసిస్టెంట్, ఆటో మొబైల్, టు విల్లర్ సర్వీసింగ్, సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్, సర్వీసింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మోడల్ స్కూల్‌లో
స్పాట్ అడ్మిషన్లు
కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వర కు మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాఘవేంద్ర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మోడల్ స్కూల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 98857 65688 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
గురువుల పాత్ర ఎనలేనిది
కల్వకుర్తిటౌన్: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిదని కల్వకుర్తి సీనియర్ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టీఎల్‌ఎం మేళాలో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగేందుకు గురువులు అందించే ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనిదన్నారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో అర్థవంతంగా విద్య అందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎంఈఓ శంకర్‌నాయక్, ఎస్‌ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు.
రైతులు వదంతులు నమ్మొద్దు
పాన్‌గల్: మండలంలో యూరియా కొరత లేదని.. రైతులు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి యూరియా సరఫరాపై అధికారులతో ఆరా తీశారు. అలాగే వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. యూరి యా కొరత ఉందనే పుకార్లతో రైతులు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు చేరుకుంటున్నారన్నారు. మండలంలోని సింగిల్‌విండో కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 13,500 బస్తా లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రోజుకు 750 బస్తాల చొప్పున రైతులకు అందిస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసే యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో బయోమెట్రిక్ విధానం ద్వారా ఎకరాకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్న ట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని.. వారికి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మేరకు యూరియా అందిస్తామన్నారు. ఆయ న వెంట కార్యాలయం సిబ్బంది ఉన్నారు.