
యూరియా కోసం బారులు
ఉప్పునుంతల/తాడూరు: రెండు బస్తాల యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. పీఏసీఎస్‌ల వద్ద పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఉప్పునుంతల, తాడూరు పీఏసీఎస్‌లకు యూరియా వస్తుందని సమాచారం అందుకున్న రైతులు.. వేకువజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. సాగుచేసిన పంటలకు అవసరమైన యూరియాను ఎలాగైనా సమకూర్చుకోవాలని గంటల తరబడి నిరీక్షించారు. అయితే పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు ఆధారంగా ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఉప్పునుంతలలో 450 బస్తాలు, తాడూరులో 300 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొంత ఆలస్యంగా వచ్చిన చాలా మంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

యూరియా కోసం బారులు