
మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం
నాగర్‌కర్నూల్: మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రెండు నెలల కాలంలో ఎకై ్సజ్, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ప్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే మాదకద్రవ్యాల విక్రేతలు, రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్ప్రరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. హానికరకమైన మత్తు పానీయాలు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయన్నారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.