
రాజకీయ నాయకులతో సమీక్ష
● ముసాయిదా ఓటరు జాబితా విడుదల
● జిల్లాలో 6,47,342 మంది ఓటర్లు
● వచ్చె నెల 2న తుది జాబితా
● ఓటరు నమోదులో మహిళలదే పైచేయి
అచ్చంపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం ఓటరు ముసాయిదా తుది జాబితా విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉండగా.. 4,102 వార్డులు ఉన్నాయి. వీటికి గాను 4,102 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,342 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 3,23,015 మంది పురుషులు, 3,24,316 మంది మహిళలు, 11 ఇతరులు మంది ఉన్నారు. పురుషుల కంటే 1,301 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. ఇక జిల్లాలోని 20 మండలాల వారీగా పరిశీలిస్తే.. అచ్చంపేట, అమ్రాబాద్, లింగాల, ఉప్పునుంతల, ఊర్కొండ, వంగూరు, వెల్దండ, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీఓల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలిపే అవకాశం కల్పించారు. ఆదివారం ఈ అభ్యంతాలపై డీపీఓ ఆధ్వర్యంలో పరిష్కారం చూపనున్నారు. అనంతరం వచ్చే నెల 2న అన్ని గ్రామ పంచాయతీల్లో తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని డీపీఓ పేర్కొన్నారు.