
యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు
నాగర్‌కర్నూల్: గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. భారీ వర్షాలు, తాగునీటి నిర్వహణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం, గ్రామ పంచాయతీ, ఆర్థిక నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్, రెండో సాధారణ ఎన్నికలు ముందస్తు ఏర్పాట్లుపై డివిజనల్, మండల పరిషత్, పంచాయతీ అధికారులు, కార్యదర్శులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రతి గ్రామంలో బోర్లు, నీటి ట్యాంకులు శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని, మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని, దోమల పెరగకుండా నీటి నిల్వ తొలగించడం, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కూలిపోయే స్థితిలో ఉండే ఇళ్లను గుర్తించి వాటిలో ఎవరూ నివాసం ఉండకుండా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాను గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, అందుబాటులో లేకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవరాయలు, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
2న ఓటర్ల తుది జాబితా
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 460 గ్రామాల వారిగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాను సిద్ధం చేసి 4102 వార్డులతో ప్రచురించామని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతోపాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం జిల్లాస్థాయి రాజకీయ పార్టీ నేతలతో భేటీ, శనివారం మండల స్థాయి రాజకీయ పార్టీ నేతలతో ఎంపీడీఓల భేటీ, 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, 2న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామన్నారు. ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో రాష్ట్ర వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ప్రతి ఓటర్ తమ ఓటుహక్కు జాబితాలో ఉందో.. లేదో.. చెక్ చేసుకోవాలని సూచించారు.