
డీడీ కట్టిన ప్రతిరైతుకు ట్రాన్స్‌ఫార్మర్లు
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్/ పెంట్లవెల్లి: ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, డీడీలు కట్టిన రెండు నెలల్లో రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని దావాజిపల్లిలో, అయ్యవారిపల్లి, కొండూరు, మొలచింతలపల్లి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు, పెద్దదగడలో రూ.3 కోట్లతో చేపట్టనున్న శ్రీతిరుమలనాథస్వామి ఆలయ మల్టీ కల్చరల్ ఆడిటోరియం నిర్మాణానికి, కల్వకోల్ క్రాస్‌రోడ్ నుంచి మైలారం వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం కాళ్లు అరిగేలా తిరిగాల్సిన అవసరం లేదని, డీడీలు కట్టిన రైతులకు రెండు నెలల్లో సామగ్రి అంతా ఇచ్చి కనెక్షన్లు ఇస్తారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోందని, దళారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దన్నారు. ఎవరైనా ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే మహిళాసంఘాల ద్వారా వారికి రుణాలు ఇప్పించి, బిల్లు వచ్చాక తిరిగి రుణం చెల్లించేలా చూస్తామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మాజీ సర్పంచ్ గోపాల్, నాయకులు నర్సింహయాదవ్, రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, కబీర్, నర్సింహనాయుడు, ధర్మతేజ, నాగిరెడ్డి, భీంరెడ్డి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.