వసతులున్నా.. ఆటలు అంతంతే! | - | Sakshi
Sakshi News home page

వసతులున్నా.. ఆటలు అంతంతే!

Aug 29 2025 7:24 AM | Updated on Aug 29 2025 2:17 PM

 A mini stadium in Achampeta without a single coach

ఒక్క కోచ్‌ కూడా లేని అచ్చంపేటలోని మినీ స్టేడియం

ఉమ్మడి జిల్లాలో క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గురువులు కరువు

కోచ్‌లు లేక వెలవెలబోతున్న మైదానాలు

కొత్త క్రీడాపాలసీలో శిక్షకుల నియామకాలపై ఆశలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో క్రీడారంగాన్ని కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని జిల్లాల్లో మైదానాలు ఉన్నప్పటికీ కోచ్‌లు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణకు దూరమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు పీఈటీలు, సీనియర్‌ క్రీడాకారులు తమకున్న ఆసక్తితో క్రీడాకారులకు స్వచ్ఛందంగా శిక్షణనిస్తున్నారు. కాని కోచ్‌లు లేకపోవడంతో చాలా క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వెనుకబడుతున్నారు.

● మహబూబ్‌నగర్‌లోని ప్రధాన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికం. ఇంత గతంలో కోచ్‌లతో కళకళలాడిన ఈ స్టేడియం ప్రస్తుతం నలుగురు కోచ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్లుగా కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, స్విమ్మింగ్‌ కోచ్‌లు మాత్రమే ఉన్నారు. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్‌ కోచ్‌ శిక్షణ ఇస్తారు. ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ కోచ్‌ ఉండగా ఇండోర్‌ స్టేడియంలో పే అండ్‌ ప్లే పద్ధతిలో బ్యా డ్మింటన్‌ కోచ్‌ మాత్రమే ఉన్నారు. మిగతా క్రీడలకు శిక్షకులు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు నిరాశకు గురవుతున్నారు. కబడ్డీ, హాకీ, ఖో–ఖో, హ్యాండ్‌బాల్‌, ఇండోర్‌లో బాక్సింగ్‌, జూడో, టేబుల్‌ టెన్నీస్‌ తదితర క్రీడలకు కోచ్‌ల అవసరం ఉంది.

● 2007 నుంచి స్టేడియంలలో శాశ్వత పద్ధతిన కోచ్‌ల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కోచ్‌లు కూడా తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా యువజన, క్రీడాశాఖ పరిధిలో జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంతో పాటు మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం, ఎంవీఎస్‌ కళాశాలలోని ఇండోర్‌ స్టేడియం, జడ్చర్లలోని మినీ స్టేడియం, సీసీకుంట అల్లీపూర్‌, భూత్పూర్‌ మండలం పోతులమడుగులో మినీ ఇండోర్‌ స్టేడియంలు ఉన్నాయి. మెయిన్‌ స్టేడియంలో ఐదుగురు, అల్లీపూర్‌లో కబడ్డీ కోచ్‌ మాత్రమే ఉన్నారు.

● వనపర్తిలో ఒక క్రీడా ప్రాంగణం, మరో ఇండోర్‌ స్టేడియం ఉండగా ఒక్క కోచ్‌ కూడా లేరు. హాకీ అకాడమీలో ఇద్దరు కోచ్‌లు ఉన్నారు.

● నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌, అచ్చంపేటలో మినీ స్టేడియంలు, కల్వకుర్తిలో ఇండోర్‌ స్టేడి యం ఉన్నాయి. కొల్లాపూర్‌కు ఇటీవల అథ్లెటిక్స్‌ కోచ్‌ రాగా కల్వకుర్తిలో ఫుట్‌బాల్‌ కోచ్‌, ఖేలో ఇండియా కబడ్డీ కోచ్‌ ఉన్నారు.

● నారాయణపేట జిల్లా మక్తల్‌లో స్టేడియం ఉండ గా ఒక్క కోచ్‌ లేరు. ధన్వాడలో ఒక రెజ్లింగ్‌ కోచ్‌, నారాయణపేటలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ కోచ్‌ ఉన్నారు.

● గద్వాలలో స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, ఎర్రవల్లి చౌరస్తాలో ఇండోర్‌ స్టేడియం ఉన్నాయి. గద్వాలలో ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ కోచ్‌ మాత్రమే ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా మైదానాల్లో వాచ్‌మెన్‌లు కూడా లేని పరిస్థితి నెలకొంది.

నిధుల కొరత

యువజన, క్రీడాశాఖలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 2006 వరకు వార్షిక నిర్వహణ పేరిట అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీలకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు నిధులు మంజూరు చేసేది. ఈ నిధులతో క్రీడల నిర్వహణ, క్రీడాసంఘాలకు ఆర్థికసాయంతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు టీఏ, డీఏలు చెల్లించేవారు. కాని ప్రస్తుతం నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేక క్రీడాశాఖలు ఏర్పాటు చేసినా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. నూతన క్రీడాపాలసీలో కోచ్‌ల నియామకంతో పాటు క్రీడాశాఖలను బలోపేతం చేయాలని సీనియర్‌ క్రీడాకారులు కోరుతున్నారు.

హ్యాండ్‌బాల్‌ కోచ్‌ను నియమించాలి.. 

ప్రధాన స్టేడియంలో 1997 నుంచి 2006 వరకు రవికుమార్‌ హ్యాండ్‌బాల్‌ కోచ్‌గా పనిచేసినప్పుడు ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అనంతరం నేను 2009 వరకు కోచ్‌గా పనిచేసి అనివార్య కారణాలతో మానేశాను. తర్వాత కోచ్‌ నియామకం చేపట్టలేదు. అయినా క్రీడపై ఉన్న ఆసక్తితో ఇప్పటికీ శిక్షణనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత పద్ధతిన కోచ్‌ను నియమిస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు.

– ఎండీ జియావుద్దీన్‌, సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు, మహబూబ్‌నగర్‌

ప్రతిపాదనలు పంపించాం..

కోచ్‌ల నియామకంపై ఇదివరకే ప్రతిపాదనలు పంపించాం. నూతన క్రీ డాపాలసీతో ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరగనుంది. స్టేడియంలలో కోచ్‌ల నియామకం జరిగే అవకాశం ఉంది. క్రీడా శిక్షణతో నైపుణ్యంగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. గ్రామీణస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసుకోవచ్చు.

– ఎస్‌.శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement