
విద్యాధికారుల నిర్లక్ష్యంపై అసహనం
నాగర్ కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం డీఈఓ రమేష్‌కుమార్‌తో కలిసి ఎంఈఓలు, క్లస్టర్ హెచ్‌ఎంలతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలపై ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. నెలలో ఎంఈఓ 20 పాఠశాలలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు 12 పాఠశాలలు పర్యవేక్షించి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో పొందుపరచాల్సి ఉండగా.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూడైస్ విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదన్నారు. కేవలం తాడూరు, పెద్దకొత్తపల్లి మండలాల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు సమర్థవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
డిజిటల్ పద్ధతిలో బోధన
తెలకపల్లి: డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కారువంగ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. చిన్న చిన్న ఉదహారణలతో గణితాన్ని బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందన్నారు.