
యూరియా కోసం జిల్లాలోని పీఏసీఎస్‌ల వద్ద రైతుల బారులు
వెల్దండలో లారీ లోడ్ కోసం 200 మంది రైతుల నిరీక్షణ
వర్షంలోనూ తప్పని ఎదురుచూపులు
అధిక వినియోగం, ఒకేసారి వరినాట్లతో డిమాండ్
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ఎదుట బారులు తీరి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షించినా అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాలను మాత్రమే విక్రయిస్తున్నారు. యూరియా కొరత నేపథ్యంలో తమ పంటను కాపాడుకునేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం సైతం జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ఎదుట యూరియా కోసం నిరీక్షిస్తూ రైతులు బారులు తీరడం కనిపించింది. సాగుచేస్తున్న పంట విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలే ఇస్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
5 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ సారి వరి, మొక్క జొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు. మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం సుమారు 5 లక్షల ఎకరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల పరిధిలో యూరియాకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఆయా చోట్ల నిల్వలు అడుగంటకముందే అధికారులు అప్రమత్తమై సరిపడా స్టాక్‌ను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, రోజుల తరబడి స్టాక్ తెప్పించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట తదితర మండలాల్లో యూరియా సరఫరా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధిక వినియోగం, నిల్వతో డిమాండ్
జిల్లాలో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అందుకు తగినంత సరఫరా లేకపోవడంతో పలుచోట్ల కొరత ఏర్పడుతోంది. వరి నాట్ల పూర్తయిన తర్వాత పిలకల దశంలో పైరు ఎదుగుదల కోసం రైతులు విస్త్రృతంగా యూరియాను వినియోగిస్తున్నారు. రైతులు అవసరానికి మించి పంటలకు ఎక్కువగా యూరియా వినియోగించడం, కొరతగా ఉందన్న కారణంతో చాలామంది రైతులు ఎక్కువ బస్తాలను ముందుగానే స్టాక్ చేసి పెట్టుకోవడంతో కృత్రిమంగా కొరత తలెత్తుతోందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు దుకాణాల్లో నిల్వలను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన యూరియా – 20,336 టన్నులు
రెండు బస్తాలే ఇస్తున్నారు..
నేను రెండు ఎకరాల్లో వరి, మరో నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఉదయం 8 గంటల నుంచే వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద లైన్‌లో నిల్చున్నా. ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. లారీ లోడు వచ్చిన గంటలోపే అయిపోయింది. సరిపడా యూరియా ఇచ్చి ఇబ్బందులు తొలగించాలి.
– జంగయ్య, రైతు, చెరుకూర్, వెల్దండ మండలం
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు..
జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాం. ఈసారి జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో అదనపు యూరియా కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ఎవరైనా ఎమ్మార్పీకి మించి యూరియా అమ్మినా, కృత్రిమంగా కొరత సృష్టించినా చర్యలు తీసుకుంటాం.
– యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి