
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 3,489 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం 5 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశం ఉన్నందున అదనపు ఎరువులు కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయానికి నివేదిక పంపిస్తామన్నారు. గతేడాది ఆగస్టులో 8,500 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామని, ఈసారి 10 వేల టన్నుల ఎరువులు అవసరం కావొచ్చని అభిప్రాయపడ్డారు. డీలర్లు రైతులకు ఎమ్మార్పీకి మించి ఎరువులు అమ్మినా, యూరియాకు వేరే ఎరువులు లింక్ చేసి అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.