
సమస్యలు పరిష్కరిస్తాం..
అచ్చంపేట: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ మురళి అన్నారు. సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్‌లో అచ్చంపేట పట్టణ ప్రజలు పలు సమస్యలను ఏకరవు పెట్టారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, రోడ్లపై మురుగు పారకుండా డ్రెయినేజీలు నిర్మించాలని, పిచ్చిమొక్కల తొలగింపు, వీధిదీపాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, దోమల నివారణ, సీసీ రోడ్ల నిర్మాణం, బోరు మోటార్ల మరమ్మతు, తాగునీరు, పందుల బెడద తదితర సమస్యలను పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్ స్పందించి రెండు, మూడు రోజుల్లో ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
● ప్రశ్న: మా వీధిలో వీధిదీపాలు వెలగడం లేదు. చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం.
– బాల్‌లింగం, 19వ వార్డు
● కమిషనర్: మా సిబ్బంది కాలనీ సందర్శించి పరిశీలిస్తారు. వీధిదీపాల ఏర్పాటు చేసి కాలనీలో చీకట్లు లేకుండా చూస్తాం.
● ప్రశ్న: ఉప్పునుంతల రోడ్డులో నిర్మాణంలో ఉన్న కల్వర్టును వెంటనే పూర్తి చేయించండి.
– జంగయ్య, స్థానికుడు
● కమిషనర్: కల్వర్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసేలా ఆర్‌అండ్‌బీ అధికారలు దృష్టికి తీసికెళ్లి వారం రోజుల్లో రాకపోకలు పునరుద్ధరించే విధంగా చూస్తాం.
● ప్రశ్న: సాయినగర్ కాలనీలో ఇల్లు కట్టుకొని 25 ఏళ్లు అవుతుంది. శంకర్ మెకానిక్ నుంచి డ్రెయినేజీ, సీసీ రోడ్లు లేవు. చిన్నగా ఉన్న డ్రెయినేజీని పెద్దగా నిర్మించండి.
– సుధాకర్, సాయినగర్‌కాలనీ
● కమిషనర్: మా సిబ్బంది వచ్చి పరిశీలిస్తారు. అవసరమైతే కొత్తగా డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం.
● ప్రశ్న: రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్‌రూంల వద్ద డ్రెయినేజీ, చెత్తాచెదారం తొలగించండి. కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. శివసాయినగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేసి.. మురుగు కాల్వ శుభ్రం చేయండి.
– సైదులు, రాజీవ్‌కాలనీ, స్వామి, శివసాయినగర్
● కమిషనర్: డ్రెయినేజీలో చెత్తాచెదారం తొలగిస్తాం. కరెంట్ సమస్య, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు గురించి విద్యుత్ అధికారులకు సూచిస్తాం. మురుగు కాల్వ శుభ్రం చేయిస్తాం.
● ప్రశ్న: టంగాపూర్ కాలనీలో పెద్దమ్మగుడి వద్ద డ్రెయినేజీ సగం కట్టి వదిలేశారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు.
– వందన, టంగాపూర్ కాలనీ
● కమిషనర్: కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మురుగు కాల్వను శుభ్రం చేయిస్తాం.
● ప్రశ్న: వినాయకనగర్‌లో సీసీ రోడ్డు వేయాలి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లు శుభ్రం చేయడం లేదు. పెరిగిన చెట్లతో పాములు వస్తున్నాయి. – దేవి, వినాయకనగర్,
సుప్రియ, మార్కెట్ రోడ్డు, బుజ్జి ఆదర్శనగర్, హమ్మద్ ఆర్టీసీ బస్టాండు ఏరియా
● కమిషనర్: అక్కడ డ్రెయినేజీని వెంటనే శుభ్రం చేయిస్తాం. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తాం. సీసీ రోడ్డు నిర్మాణానికి కొంత సమయం పడతుంది. ప్రణాళికాబద్ధంగా అవసరమైన ప్రదేశాలను గుర్తించి చేపడుతాం.
ప్రశ్న: మారుతినగర్‌లో కరెంటు స్తంభాలు వేశారు. వైరు లాగి వీధిదీపాలు ఏర్పాటు చేయండి. ముస్లిం శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.
– మల్లికార్జున్ మారుతినగర్,
ఉస్మాన్ పట్టణవాసి
కమిషనర్: విద్యుత్‌శాఖ వైరు లాగితే వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. శ్మశాన వాటికలోనూ ఏర్పాటు చేసేలా చూస్తాం.
ప్రశ్న: చేపల మార్కెట్ లేక రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నాం. మార్కెట్‌లోకి తరలించేలా చూడండి. మల్లంకుంట బఫర్ జోన్‌లో అసంపూర్తి, అక్రమ కట్టడాలను తొలగించండి.
– రేణయ్య, పట్టణవాసి
కమిషనర్: ఇంటిగేట్రేడ్ మార్కెట్ కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. మార్కెట్ నిర్మాణం జరిగితే అందరికీ అందులో అవకాశం కల్పిస్తాం. అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి తొలగిస్తారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు దీనిపై లేఖ రాశాం.
ప్రశ్న: ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు పెరిగి పాములు, పురుగులు వస్తున్నాయి. మల్లకుంట రోడ్డుపై పడేసిన వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతుండటంతో హాస్టల్ విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వీధిదీపాలు లేక రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. ఆదర్శనగర్‌లో మాలమహానాడు భవనం వద్ద పిచ్చిమొక్కలు తొలగించి, సీసీ రోడ్డు నిర్మించండి.
– జగదీష్ 14 వార్డు పాత బస్టాండు, మల్లేష్ ఆదర్శనగర్
కమిషనర్: పిచ్చి మొక్కలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు వేసే వారిని గుర్తించి అక్కడ వేయకుండా అవగాహన కల్పిస్తాం. వెంటనే పాడైన వీధిదీపాలను ఏర్పాటు చేస్తాం.
ప్రశ్న: సాయినగర్ ప్రాథమిక పాఠశాలలో మురుగు నిలుస్తోంది. ఆర్టీసీ బస్టాండు ఇన్ గేట్ వద్ద మురుగు కాల్వ శుభ్రం చేయడం లేదు. దోమల బెడద ఎక్కువగా ఉంది.
– గణేష్, సాయినగర్, నారాయణ ఆర్టీసీ బస్టాండు ఏరియా
కమిషనర్: సిబ్బందిని పంపించి మురుగు నిల్వకుండా పారిశుద్ధ్య చర్యలు చేపడుతాం. అలాగే ఆర్టీసీ బస్టాండు నుంచి మురుగు రాకుండా చేస్తాం.
ప్రశ్న: వలపట్ల కాలనీ రోడ్డుపై మట్టిలో కూరుకుపోయిన సింగిల్ ఫేజ్ బోరు మోటార్ ప్లాట్ ఫాం నిర్మించి, మినీ ట్యాంకు నీళ్లు ఇచ్చేలా పునరుద్ధరించాలి.
– సుధాకర్, 13వ వార్డు
కమిషనర్: వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండటంతో మట్టిపోశాం. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి వెంటనే పునరుద్ధరించే పనులు చేపడుతారు.
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో అచ్చంపేటమున్సిపల్ కమిషనర్ మురళి
మున్సిపాలిటీలో
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రాధాన్య క్రమంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం
వీధి దీపాలు, విద్యుత్ లైన్ల
ఏర్పాటుకు చర్యలు
మా దృష్టికి వచ్చిన సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం