
స్కానింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ సదుపాయాన్ని కల్పించామని సద్వినియోగం చేసుకోవాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి అన్నారు. సోమవారం గర్భిణులకు అవసరమైన ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి రేడియాలజిస్ట్ వైద్యులు రిపోర్టు చేయడంతో స్కానింగ్ సేవలు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని, సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణులకు స్కానింగ్ సేవలు చేస్తారన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, పలు వ్యాధుల నిర్ధారణ కోసం డిజిటల్ ఎక్స్ రే ప్రతిరోజు 80 నుంచి 90 రోగులు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక వ్యాధి నిర్ధారణ నిమిత్తం అవసరమైన రోగులకు సిటీ స్కాన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ ప్రశాంత్, రోహిత్, రేడియాలజిస్ట్ ఈశ్వరి, గ్రేడ్ వన్ మెడికో సోషల్ వర్కర్స్ జ్యోతి, విజయలక్ష్మి, బాలమ్మ, హెల్ప్ డెస్క్ ఇన్‌చార్జ్ యాదగిరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.