
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
మన్ననూర్: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. మంగళవారం డీఈఓ రమేశ్‌తో కలిసి మన్ననూర్ గిరిజన ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థి దశలోనే మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అంతకు ముందు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ పథకం కింద ఏర్పాటుచేసిన శానిటరీ న్యాప్‌కిన్స్ తయారీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులకు న్యాప్‌కిన్స్ పంపిణీ చేసే సామర్థ్యానికి ఎదగాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలకిషన్, నర్సింహులు, హెచ్‌ఎం సిద్దార్థ మహదేవ్ తదితరులు ఉన్నారు.