
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత
● రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు
● పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు
● 2 వేలకుపైగానే ఎఫ్‌లైన్ అర్జీల పెండింగ్
● తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు
రికార్డులు శిథిలావస్థకు..
ఉమ్మడి ఇల్లాలో సర్వే చేసేందుకు సిబ్బంది కొరతతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. రీ సర్వే చేయకపోవడంతో చాలా కార్యాలయాల్లో రికార్డులు శిథిలావస్థకు చేరాయి. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ సంతకం పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ చేసేలా పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. దీని ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతనిపై చర్యలకు అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. లైసెన్స్ సర్వేయర్ తప్పు చేస్తే ఏమి టి పరిస్థితి అనేది ఎక్కడా లేదు. ఇందుకోసం సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరిస్తేనే క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించనుంది.
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు.
జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు
మహబూబ్‌నగర్ 27 18 9
నారాయణపేట 8 3 5
జోగుళాంబ గద్వాల 20 9 11
నాగర్‌కర్నూల్ 28 13 15
వనపర్తి 26 13 13
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..

సర్వేయర్లు కావాలె..