
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తేనే జీవితంలో స్థిరపడతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును అశ్రద్ధ చేయొద్దన్నారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివి కొత్త విషయాలు తెలుసుకోవాలని తెలిపారు. ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ సునీత మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఎస్‌బీఐ కొంత కార్పస్ ఫండ్ సమాజ సేవకు వినియోగిస్తుందని.. నాగర్‌కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో 230 మంది పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ రాకేశ్ శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, హెచ్‌ఎం శోభన్‌బాబు పాల్గొన్నారు.