
అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా ప్రగతి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి, అడ్డంకులు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానం పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, వందశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. ప్రభుత్వ శాఖల పురోగతిపై నిర్వహించే సమీక్షకు సంబంధిత జిల్లా అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని.. అనుమతులకు సంబంధించిన ప్రతి ఫైల్ ఈ–ఆఫీస్ ద్వారానే పంపించాలని సూచించారు. జిల్లా అధికారులకు కేటాయించిన గురుకులాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. భోజనం నాణ్యతపై తరచూ సమీక్షలు జరిపి.. అవసరమైన మార్పులు చేయాలన్నారు. ప్రజావాణి, ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కారం సాధ్యపడని దరఖాస్తుల విషయంలో తగిన కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ.. సంబంధిత నివేదికలను సమర్పించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై
దృష్టి సారించండి..
జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్–11పై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌ను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే డ యల్ 1098కు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాలలను పనిలో పెట్టుకునే వారికి చట్టప్రకారం శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయిన పిల్లలందరినీ గుర్తించి.. తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా ఉపాధి అవకాశాల నిమిత్తం వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మానసిక స్థితి సరిగా లేని బాలలకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి.. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. కాగా, గతేడాది నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 30 మంది, ముస్కాన్ కార్యక్రమంలో 24 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఏఎస్పీ రామేశ్వర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
సంక్షేమ పథకాల అమలులోనిర్లక్ష్యం వహించొద్దు
కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
కలెక్టర్ బదావత్ సంతోష్