
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు వ్యయ, ప్రయాసాలకోర్చి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కారమార్గం చూపాలని సూచించారు. ఏదేని దరఖాస్తు పరిష్కారం కాని పక్షంలో సంబంధిత అర్జీదారుకు తెలియజేయాలని సూచించారు. కాగా, ప్రజావాణికి వివిధ సమస్యలపై 46 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.