
అసలేం జరుగుతోంది..
నాగర్‌కర్నూల్: జిల్లా పంచాయతీ అధికారిని కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా ఇటీవల కలెక్టరేట్‌కు చేరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఉన్నతాధికారుల నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే తెరవెనక ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు నేతల ఆగ్రహమే కారణమా?
జిల్లా పంచాయతీ అధికారి బదిలీ వెనక ఇద్దరు ప్రధాన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో జరిగిన రెండు సంఘటనలు వారి ఆగ్రహానికి కారణమై ఉండవచ్చని పలువురు చెబుతు న్నారు. జూన్ 21న కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో ఓ రిసార్ట్‌ను కూలగొట్టేందకు డీపీఓ తమ సిబ్బందితో వెళ్లిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని రిసార్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని.. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులు కక్షపూరితంగా కూల్చివేసేందుకు అధికారులను పంపారని ఆందోళనకు దిగారు. కొందరు పెట్రోల్ బాటిళ్లతో రిసార్ట్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇక చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఇదిలా ఉంటే, కొన్ని నెలల క్రితం అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంటలో బీఆర్‌ఎస్ నాయకుడికి చెందిన హోటల్ ప్రభుత్వ స్థలంలో ఉందంటూ కూల్చేశారు. అయితే సదరు బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో హోటల్ తిరిగి కట్టించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు సదరు బాధితుడికి హోటల్ నిర్మించి ఇచ్చారు. ఈ రెండు సంఘటనలు అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. వారి ఆగ్రహంతోనే డీపీఓను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారనే ప్రచారం సాగుతోంది.
ఆది నుంచి వివాదాస్పదమే..
జిల్లా పంచాయతీ అధికారి తీరు ఆది నుంచి కొంత వివాదాస్పదంగానే ఉంది. కేవలం అధికార పార్టీ నేతల మాటలకు తలొగ్గి పనిచేస్తూ.. ఇతరుల ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాములలో ప్రభుత్వం నిర్మించిన డంపింగ్ యార్డును కొందరు ఉద్దేశపూర్వకంగా కూలగొట్టారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గత మార్చి 27న బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలకపల్లి మండల కేంద్రంలో 40 దుకాణాలను అనుమతులు లేకుండా నిర్మించారని.. వీటిపై చర్యలు తీసుకోవాలని కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే నాలుగు నెలలుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ దుకాణాల అక్రమ నిర్మాణంపై ఇప్పటి వరకు మూడుసార్లు ఫిర్యాదు లు అందినా కనీస స్పందన కరువైంది.
అన్ని ఫిర్యాదులపైఒకేలా స్పందించాలి..
అధికారులు అన్ని ఫిర్యాదులపై ఒకేలా స్పందించాలి. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల మాటలు విని కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్పాములలో డంపింగ్ యార్డు కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందన లేదు.
– ఎల్లేని సుధాకర్‌రావు,
బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు
కమిషనరేట్‌కు డీపీఓ అటాచ్ అంటూ ప్రచారం
ఇప్పటికే ఆర్డర్ కాపీ కలెక్టరేట్‌కు చేరిందంటూ చర్చ
స్పష్టత ఇవ్వని ఉన్నతాధికారులు
సోమశిల రిసార్ట్, అచ్చంపేట హోటల్ ఘటనలే కారణమా..?