
బడులు బాగుపడేనా..?
ఉపాధ్యాయులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు
తనిఖీ చేసే అంశాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు సైన్స్ ల్యాబ్‌ల వినియోగం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, పారిశుద్ధ్య చర్యలు, వైద్యం, తాగునీటి సదుపాయాలు, లైబ్రరీ ఇతర సౌకర్యాలను పరిశీలిస్తారు. ప్రాథమిక పాఠశాల తనిఖీ అధికారి రోజుకు రెండు స్కూళ్లను సందర్శించాలి. మూడు మాసాల్లో కనీసం వంద పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలకు సంబంధించి రోజుకు ఒక స్కూల్‌ను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో దాదాపు 50 పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికలను డీఈఓకు అందజేస్తారు. వీటిపై ఉన్నతాధికారులు ప్రతినెలా 5వ తేదీన సమీక్షిస్తారు.
ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత..
పాఠశాలల తనిఖీలతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగించే విధానంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈఓలు, జీహెచ్‌ఎంల పర్యవేక్షణలో ఉన్న పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీలు చేయించడం సరైంది కాదని పలువురు హెచ్‌ఎంలు పేర్కొంటున్నారు. అలాగే తనిఖీ చేసే ఉపాధ్యాయులకు హెచ్‌ఎంలు ఎంత వరకు సహకరిస్తారనేది అతిపెద్ద ప్రశ్న. మరోవైపు మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమించడం వల్ల విద్యార్థులకు బోధనలో నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కందనూలు: సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే భావనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసైనా సరే.. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, పాఠశాలలపై మరింత పర్యవేక్షణ పెంచడానికి రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యావ్యవస్థలో మార్పునకు సర్కారు చర్యలు
ఇకపై పాఠశాలలను తనిఖీ చేయనున్న టీచర్లు
బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
జిల్లాలో 131 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 125 ప్రాథమికోన్నత, 560 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 3,513 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో జీహెచ్‌ఎంలు 152 మంది, పీఎస్ హెచ్‌ఎంలు 105, ఎస్జీటీలు 1,511 మంది, స్కూల్ అసిస్టెంట్లు 1,745 మంది ఉన్నారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 2శాతం మందిని తనిఖీ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.