
నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్‌కు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన గ్రామానికి చేరుకొని విద్యుత్ సబ్‌స్టేషన్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పనులు, సభ ఏర్పాట్లను విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు గ్రామానికి చేరుకుంటారన్నారు. అక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రూ.25 కోట్లతో పోల్కంపల్లి, రూ.1.82 కోట్లతో బొమ్మనపల్లి, రూ.1.73 కోట్లతో పదర, రూ.2.54 కోట్లతో గట్టుతుమ్మెన్, రూ.2.24 కోట్లతో లింగాల మండలం బాకారం, రూ.2.49 కోట్లతో ఉప్పునుంతల మండలం కంసాన్‌పల్లి, రూ.2.74 కోట్లతో వంగూరు మండలం ఉల్పర, రూ.1.99 కోట్ల అంచనాలతో అచ్చంపేట మండలం సింగారంలో నిర్మించనున్న సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం 12 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారని వివరించారు. కాగా ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రణాళికతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్