
సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. ఆదివారం గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు జరగగా.. 20 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 1,872 మంది విద్యార్థులకుగాను 1,766 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,577 మందికిగాను 1,495 మంది, ఒకేషనల్ విభాగంలో 295 మందికిగాను 271 మంది పరీక్షలు రాశారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 805 మందికిగాను 773 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 602 మందికిగాను 577 మంది, ఒకేషనల్ విభాగంలో 203 మందికిగాను 196 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 106 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతుల కల్పించినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి అదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు చివరి దశకు చేరుకోవడంతో భక్తులు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివారం సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వివరించారు. వాహనాలు అధికసంఖ్యలో రావడంతో మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కలెక్టరేట్
అతిథి గృహంలో పాము
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ అతిథిగృహంలో ఆదివారం ఆరు అడుగుల పొడవుగల పాము కనబడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే స్నేక్ క్యాచర్ వంశీకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకొని పామును సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.