
అందుబాటులోకి సీటీ స్కాన్
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద బాధితులతోపాటు ఇతర రోగులకు అత్యవసరంగా అవసరమయ్యే సీటీ స్కాన్ సేవలు జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చాయి. ఏరియా ఆస్పత్రి నుంచి జిల్లా, జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ కావడంతో ఇప్పటికే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. చాలారోజుల క్రితమే కొత్తగా సీటీ స్కాన్ మిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వాటి సేవలను ప్రారంభించలేదు. దీంతో రోగుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రోగులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటికే 300 మందికి..
గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు చికిత్స చేయించేందుకు సీటీ స్కాన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో మార్చి 20 నుంచి సీటీ స్కాన్ సేవలు ప్రారంభం కావడంతో రోగులకు ఆర్థిక భారం తప్పినట్లయ్యింది. ఇప్పటి వరకు 300 మంది వరకు ఉచితంగా సీటీ స్కాన్ సేవలు పొందారు.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ప్రస్తుతం రేడియాలజిస్టు అందుబాటులో లేకపోవడంతో జనరల్ ఆస్పత్రి ఎక్స్‌రే కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సిబ్బందికి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అందించి సేవలు వినియోగించుకుంటున్నారు. సీటీ స్కాన్‌కు వచ్చే రోగులకు ముగ్గురు వైద్య సిబ్బంది మూడు షిప్టుల్లో సేవలు అందిస్తున్నారు. నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ కేంద్రం నుంచి టెలీ రేడియాలజిస్టు సేవలు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను జనరల్ ఆస్పత్రిలోని సీటీ స్కాన్ యంత్రానికి అనుసంధానం చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రమాదంలో గాయపడిన సిబ్బందితోపాటు ఇతర రోగులకు సాంకేతిక సిబ్బంది సీటీ స్కాన్ మిషన్‌లో ఫిలిం తీసిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్‌లో విధులు నిర్వహిస్తున్న రేడియాలజిస్టుకు వెళ్తాయి. ఆయన సీటీ స్కాన్ రిపోర్టులను పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు గంటల్లో జనరల్ ఆస్పత్రి వైద్యులకు పంపుతున్నారు. ఆయన సూచనల ఆధారంగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ముగ్గురు సిబ్బంది షిఫ్టుల వారీగా విధుల్లో ఉండటంతో అందరికీ సేవలు అందుతున్నాయి.
రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు ఎంతోమేలు
రూ.5 వేల విలువైన స్కానింగ్ సేవలు ఇక ఉచితంగా..
టెలీ రేడియాలజిస్టు ద్వారా
వైద్య పరీక్షలు
రెండు గంటల్లోనే రిపోర్టు..
అత్యవసర రోగులతోపాటు క్షతగాత్రులకు సేవలు అందించేందుకు సీటీ స్కాన్ ప్రారంభించాం. ప్రతిరోజు 10 మంది వరకు సీటీ స్కాన్ సేవలు పొందుతున్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది రోగులకు స్కాన్ చేసి హైదరాబాద్ నారాయణగూడలోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ కేంద్రానికి పంపుతుండటంతో రెండు గంటల్లోనే రిపోర్టులను అందిస్తున్నారు. వీటి ఆధారంగా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాం.
– రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్

అందుబాటులోకి సీటీ స్కాన్

అందుబాటులోకి సీటీ స్కాన్