
పైలెట్ గ్రామాల్లో వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్లు
నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతంగా పూర్తి చేసి బేస్మెంట్ వరకు నిర్మించిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే, వెరిఫికేషన్ చేసి అర్హులైన వారిని గుర్తించి చెక్ లిస్ట్ ప్రకారం సరి చూసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న వసతులను మెరుగుపర్చాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి గదులను పరిశీలించారు. డిజిటల్ గ్రంథాలయ ఏర్పాటు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ వనరులను అందుబాటులోకి తేవడం ద్వారా విద్యార్థులకు, రీసెర్చర్లకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని, దీనికి అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలపై అధికారులతో ఆరాతీశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. ప్రిపరేషన్ తీరు, ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రంథాలయం నుంచి ఆశిస్తున్న సౌకర్యాల గురించి అడిగారు. అనంతరం మండలంలోని తూడుకుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులు చదువుకునేందుకు విద్యుత్, నీరు, ఆట స్థలాలు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతుల ప్రణాళిక ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్, లైబ్రేరియన్ పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.