
నేడు డయల్ యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: డిపో పరిధిలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా డీఎం సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు సలహాలు, సూచనలు తెలియజేసేందుకు మధ్యా హ్నం 12 నుంచి ఒంటిగంట వరకు సెల్ నం.99592 26292కు ఫోన్ చేయాలని కోరారు.
భాషా నైపుణ్యాలు
ప్రతిబింబించేలా బోధన
కందనూలు: తరగతి గదిలో భాషా నైపుణ్యాలు ప్రతిబింబించేలా బోధన చేయాలని రాష్ట్రస్థాయి రీసోర్స్‌పర్సన్ అనురాధ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న తెలుగు, హిందీ భాషా పండితుల శిక్షణ తరగతులను ఆమె సందర్శించి మాట్లాడారు. మాతృభాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధనా పద్ధతులను ప్రతి ఉపాధ్యాయుడు మెరుగుపరుచుకోవాలన్నారు. భాషా పండితులు తమ బోధనా పద్ధతులకు ఆకర్షణీయ వాతావరణం కల్పించుకోవాలన్నారు. తరగతి గది బోధనలో భాషా సంస్కృతులను ప్రతిబింబించడం ద్వారా, విద్యార్థులకు తమ సాంస్కృతిక, భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. అంతేకాకుండా తరగ తి గదిలో ఒక స్నేహపూర్వకమైన, సంక్షేమ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని చెప్పారు. మాతృభాషలో విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకతపై ప్రతి భాషా పండితుడు దృష్టిపెట్టాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో తెలుగు, హిందీ భాషా పండితుల ఆర్పీలు కమలేకర్ నాగేశ్వరరావు, సలీం, యాకూబ్ అలీ, జ్ఞానేశ్వర్, బాలయ్య, శ్రీనివాసులుగౌడ్, వెంకటస్వామిగౌడ్, భాషా పండితులు పాల్గొన్నారు.
ఫార్మసీ అధికారులుగా గుర్తించడం హర్షణీయం
నాగర్‌కర్నూల్ క్రైం: ఫార్మసీ ఆఫీసర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌కు ఫార్మసీ ఆఫీసర్స్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీలను శుక్రవారం అందించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రఘు మాట్లాడుతూ ఫార్మాసిస్ట్‌లను ఫార్మసీ అధికారులుగా గుర్తిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం సంతోషమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసీ అధికారుల కొరత ఉన్నప్పటికీ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు రవిశంకర్, హన్మంతురావు, అజీమ్, ప్రశాంత్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్, సీనియర్ ఫార్మసీ అధికారి రాణి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ వెంకటేష్, ఫార్మసీ ఆఫీసర్స్ శివరాణి, సుశీల, గోవర్ధన్ పాల్గొన్నారు.
జీతాలు చెల్లించాలని వినూత్న నిరసన
నాగర్‌కర్నూల్ రూరల్: తమకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని కలెక్టరేట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన శుక్రవారం మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కలెక్టరేట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, మూడు రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపామన్నారు. కార్మికులు పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి ఉన్న కడుపు చంపుకొని మూడు రోజులుగా సమస్యలపై ఆందోళన చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం