
ఆయిల్‌పాం కష్టాలు తీరేనా!
త్వరలో ఇబ్బందులు తీరుతాయి..
ఆయిల్‌ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం,
ఆయిల్‌ఫెడ్ ఇన్‌చార్జి, నారాయణపేట
నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.
– 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది.
పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం..
పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. కాగా.. ఇటీవల నారాయణపేట జిల్లాలో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం కోతలు ప్రారంభం
పంట విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే..
స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం