వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని తిమ్మాపూర్ పరిధిలోగల చాకిరేవులు గొత్తికోయగూడెంలో గురువారం వెంకటాపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించినట్లు తిమ్మాపూర్ పల్లె దవాఖానా వైద్యాధికారి చందన తెలిపారు. తిమ్మాపూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని ఆవాసానికి 10 కిలోమీటర్లు ట్రాక్టర్‌లో, మిగిలిన రెండు కిలోమీటర్ల దూరం నడిచి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. శిబిరంలో 52 మందికి వైద్య పరీక్షలు, నలుగురు గర్భిణులు, ముగ్గురు బాలింతలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. జ్వర లక్షణాలతో వచ్చిన నలుగురికి మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించగా ఎవరికీ వ్యాధులు నిర్ధారణ కాలేదని వివరించారు. అవసరమైన వారికి చికిత్స చేసి మందులు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శోభ, సుశీల, మోతీలాల్, ఆశ కార్యకర్తలు మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు.


