సమస్యలు పరిష్కరించండి మహాప్రభో! | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి మహాప్రభో!

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

ములుగు: ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలు పరిష్కరించాలని బాధితులు మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జి, ఐటీడీఏఓ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ ఏపీఓ ప్రతాప్‌లు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో 81, గిరిజన దర్బార్‌లో 19 వినతులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్‌ఓ రవికుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బాగోగులు చూసుకోవడం లేదు..

తను సంపాదించిన ఆస్తిని (భూమి) ఐదుగురు కుమారులకు సమానంగా పంచాను. భర్త కండియా 6 నెలల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొడుకులు తిండి పెట్టడం లేదు. దగ్గరికి రానివ్వక పోవడంతో ఒంటరిగా ఉంటున్న. ఇచ్చిన భూమి దున్నుకొని బతుకుతున్నారే తప్ప నన్ను పోషించడం లేదు. న్యాయం చేయాలి.

– నునావత్‌ ముంగాలి, చింతకుంట

ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. నాన్నమ్మ దగ్గర పెరిగాను. ప్రస్తుతం లారీ క్లీనర్‌గా పనిచేస్తూ నాన్నమ్మ (వృద్ధురాలు)ను పోషించుకుంటున్న. ఇల్లు లేకపోవడంతో వర్షానికి ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.

– పారనందుల శ్రీను, రామాంజాపూర్‌

ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో బాధితుల మొర

అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ఎస్‌డీసీ ప్రతాప్‌

గ్రీవెన్స్‌లో 81, గిరిజన దర్బార్‌లో 19 వినతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement