గడువులోగా గణన ఫారాల పంపిణీ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా గణన ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి

ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గణన ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గణన ఫారాలను బూత్‌ స్థాయి అధికారులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తులతో గణన ఫారాలను పంపిణీ చేయకూడదన్నారు. బూత్‌ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి గణన ఫారాలను పంపిణీ చేయాలని, అర్హత కలిగిన ఓటరు తన ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. గణన ఫారాన్ని సమర్పించిన ఓటర్ల వివరాలు మాత్రమే ముసాయిదా ఓటరు జాబితాలో కొనసాగించబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నమోదు అధికారి ఆర్డీఓ కృష్ణవేణి, సహాయ ఎన్నికల నమోదు అధికారి, తహసీల్దార్‌ విజయభాస్కర్‌, అధికారులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

ములుగు/ములుగు రూరల్‌: డ్రగ్స్‌ మహమ్మరిని తరిమికొడదామని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్‌, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, ఇతర అధికారులు డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్ష్యం చేరుకుని దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవిందర్‌, డీడబ్ల్యూఓ ప్రేమలత, నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కో ఆర్డినేటర్‌ నాగేంద్ర, ఎఫ్‌ఆర్‌ఓ గణేష్‌, డీసీపీఓ ఓంకార్‌, డీఎంసీ రమాదేవి, సీఏ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement