ములుగు: వర్షాకాలంలో సంభవించే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి జిల్లా స్థాయి అధికారులతో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విపత్తు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలను ముందుగానే గుర్తించి వారికి మూడు నెలలకు సరిపడే రేషన్ బియ్యాన్ని జూలై నెలలోనే అందుబాటులో ఉంచాలని, గ్రామాల పరిధిలో ముంపునకు గురయ్యే గృహాలను పంచాయతీ కార్యదర్శులు ముందుగానే గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. గర్భిణులు, వృద్ధులను ముందస్తుగా గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆకస్మికంగా నీటి ప్రవాహాలు పెరిగే ప్రాంతాల్లో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, స్థానిక సంస్థల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రవాణాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీడీఆర్‌ఎఫ్ బృందాలు మేడారం, ఏటూరునాగారం ప్రాంతాల్లో సిద్ధంగా ఉండాలని, పడవలు, లైఫ్ జాకెట్లు, నైలాన్ రోప్స్, ఇతర సహాయక సామగ్రిని అవసరమైన మండల కేంద్రాలలో వికేంద్రీకరణ విధానంలో ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్‌జీ, సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్‌ఓ రవికుమార్, డీ ఎస్‌పీ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


