కొలువులకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

కొలువులకు వేళాయె!

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

తొలి విడతలో 35 టీచర్‌, 103 ఆయాల భర్తీ

ములుగు: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అంగన్‌ వాడీ పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీలోగా నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు సమాచారం. జిల్లాలో ని ములుగు, ఎస్‌ఎస్‌ తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం(కె) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యా ప్తంగా 95 టీచర్‌, 349 ఆయాల పోస్టుల ఖాళీలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయకపోవడంతో వాటి నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. మరికొన్ని చోట్ల టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండుచోట్ల విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు.

17వేల మందికి పౌష్టికాహారం

జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టులు ఉండగా 640 అంగన్‌ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 17 వేల మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ఈ నాలుగు ప్రాజెక్టుల పరిధిలో టీచర్‌ పోస్టులు 95 ఖాళీగా ఉండగా ఆయా పోస్టులు 349 ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం విడతల వారీగా భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తొలి విడతలో ఎస్‌ఎస్‌ తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టు పరిధిలోని పోస్టులను, రెండు, మూడు విడతల్లో ములుగు, ఏటూరునాగారం ప్రాజెక్టులతో పాటు జిల్లాలో మిగిలిన ఖాళీలన్నీ ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలిసింది.

జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపిక

జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టుల భర్తీ కోసం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉండే సెలక్షన్‌ కమిటీ కీలకపాత్ర పోషించనుంది. ఈసారి అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు ప్రభుత్వం ఇంటర్‌ అర్హతను ప్రామాణికంగా తీసుకోనుండడంతో టీచర్‌ పోస్టుల ఎంపికపై కొంత గందరగోళం నెలకొంది. ఇంటర్‌ను ఎత్తివేసి పదో తరగతి ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకోవాలని ఇప్పటికే పలువురు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఆయా పోస్టులకు మాత్రం ఇంటర్‌ అర్హతపై సడలింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్ల భర్తీని ఇంటర్వ్యూ, ఇంటర్‌ మార్కులు, రిజర్వేషన్‌ అంశాల్లో వెయిటేజీ మార్కుల ఆధారంగా జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది.

అంగన్‌వాడీల్లో టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

జిల్లాలో 95 టీచర్‌, 349

ఆయా పోస్టుల భర్తీకి కసరత్తు

ఈనెలాఖరులోగా వెలువడనున్న

నోటిఫికేషన్‌

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొలి విడతలో ఎస్‌ఎస్‌తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టుల పరిధిలోని 35 టీచర్‌, 103 ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాయి. రెండు, మూడో విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేయనున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాళీల భర్తీ చేపడుతున్నాం. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం.

– ప్రేమలత, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement