ఏటూరునాగారం: రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఆదాయం, కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, ఈబీసీ, ఓబీసీ వంటి రెవెన్యూ శాఖ సేవల వెరిఫికేషన్ కోసం ఇకపై ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలవరీ(ఈఎస్‌డీ మీసేవ) కమిషనర్ రవికిరణ్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్(లోకల్‌బాడీ) సంపత్‌రావు, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్, మేనేజర్ దేవేందర్‌తో కలిసి ఈ డిజిటల్ సేవలతో పాటు పలు అంశాలపై మీసేవ కేంద్రాల నిర్వహకులతో సమీక్షించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనకు దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల సమర్పణకు ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చారు.
మొబైల్ యాప్ ద్వారానే..
రెవెన్యూ సేవల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈఎస్‌డీ సంస్థ ‘జీపీఓ, ఎమ్మార్‌ఐ వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్’ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో గతంలో ఈ యాప్ గురించి నిర్వహకులకు, ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించారు. ఈ మొబైల్ యాప్ విధానాన్ని కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకే పరిమితం చేసినప్పటికీ ప్రస్తుతం దీనిని రెవెన్యూశాఖలోని అన్ని కేటగిరిల సేవలకు విస్తరించారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు మీసేవ కేంద్రాల్లోని దరఖాస్తు వివరాలను, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలను నేరుగా మొబైల్‌లోనే పరిశీలించి జారీ చేయవచ్చు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
దరఖాస్తుదారుల నుంచి అధికారులు పత్రాలను నేరుగా తీసుకోవద్దని జిల్లా, మండల, గ్రామ స్థాయిలోని తహసీల్దార్లు, ఎమ్మార్‌ఐలు, జీపీఓలందరికీ సీసీఎల్‌ఏతో పాటు జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మీసేవ కేంద్రాల నిర్వహకులు దరఖాస్తుదారులను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండలం కేంద్రాలు
ములుగు 9
మల్లంపల్లి 2
వెంకటాపురం(కె) 7
గోవిందరావుపేట 6
ఎస్‌ఎస్‌తాడ్వాయి 5
ఏటూరునాగారం 6
కన్నాయిగూడెం 2
మంగపేట 10
వాజేడు 4
వెంకటాపురం(కె) 5
కాగితరహిత సేవలపై
ఉన్నతాధికారుల సమీక్ష
తహసీల్దార్లకు ఆదేశాలు జారీ
మొబైల్ యాప్‌లో సేవలు


