ములుగు రూరల్: ములుగును పోలియో రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో మొత్తం 22,572 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. 312 బూతులు ఏర్పాటు చేసి 15 మొబైల్ టీంలు, 10 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే 36 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి మొబైల్ టీంల ద్వారా పోలియో చుక్కలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పల్స్‌పోలియో కేంద్రాలను జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పర్యవేక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి సుధీర్, మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి, మాస్ మీడియా అధికారి సంపత్, దుర్గారావు, నందకిశోర్, రవి, దేవమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
14 కిలో మీటర్లు కాలినడకన..
గోవిందరావుపేట: మండల పరిధిలోని చిన్నారులకు వైద్య సిబ్బంది 14కిలో మీటర్లు కాలినడకన వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా చల్వాయి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గొత్తికోయగూడెం మామిడితోట సబ్ సెంటర్‌లో పోలియో చుక్కలు వేశారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆరోగ్య సహాయకుడు జంపయ్య, ఆరోగ్య కార్యకర్త దేవి 14కిలో మీటర్లు నడిచివెళ్లి పోలియో చుక్కలు వేశారు.
మూడు కిలోమీటర్లు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ పరిధిలోని తక్కళ్లగూడెం గొత్తికోయ గూడెంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొడిశాల పీహెచ్‌సీ వైద్యసిబ్బంది ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. గూడెంకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి చిన్నారులకు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేశారు. చుక్కలు వేసిన సిబ్బందిని గూడెం వాసులు అభినందించారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


