రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

ములుగు రూరల్‌: రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీన్‌కుమార్‌ అన్నారు. శనివారం మంత్రి సీతక్కను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారుతుందన్నారు. వర్షాలకు రంగు మారి ఎఫ్‌సీఐ బియ్యం దిగుమతులు చేసుకోవడం లేదని చెప్పారు. స్పందించిన మంత్రి సీతక్క సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఫోన్‌చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి సహోదర్‌రెడ్డి, కోశాధికారి మోహన్‌, సంగిరెడ్డి, రాణిశ్రవన్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి

ములుగు రూరల్‌: గ్యాస్‌ వినియోగదారులు ఈ నెల 30వ తేదీ వరకు వందశాతం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్‌ ఫైసల్‌ హుస్సేని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 8 గ్యాస్‌ ఏజెన్సీలలో 92,289 మంది వినియోగదారులు ఉన్నారన్నారు. 20,076 మంది దీపం పథకం, 23,299 మంది ఉజ్వల యోజన పథకం, మహలక్ష్మీ పథకం ద్వారా 50,135 మంది వినియోగదారులు ఉన్నారని అన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా లబ్ధిరులకు ప్రభుత్వం రూ. 6.65 కోట్లను విడుదల చేసిందని అన్నారు. వినియోగదారులు ఈ కేవైసీని తప్పని సరిగా చేసుకొని సబ్సిడీ పొందాలని అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి

ములుగు రూరల్‌: బీజేపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న బూత్‌ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్‌లాల్‌, శ్రీమంతుల రవీంద్రాచారి, కృష్ణాకర్‌, విశ్వనాథ్‌, ఇమ్మడి రాకేష్‌, వెంకన్న, రవిరెడ్డి పాల్గొన్నారు.

పూరిగుడిసె నేలమట్టం

మంగపేట: మండలంలోని కమలాపురం ఆర్‌పీహెచ్‌కాలనీకి చెందిన కండల భాస్కర్‌కు చెందిన పూరిగుడిసె శనివారం నేలమట్టమైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు శనివారం కురిసిన వర్షానికి పూరిగుడిసె పూర్తిగా కూలిపోయింది. దీంతో గుడిసెలోని గృహోపకర వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వార ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని.. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

వ్యసనాలకు

దూరంగా ఉండాలి

ములుగు: నేటి సమాజంలో యువత మత్తు బారిన పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుందని డ్రగ్స్‌, గంజాయి సేవించడంతో కేన్సర్‌కు గురయ్యే ప్రమాదముందని యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మేకల మహేందర్‌ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. యువత తల్లిదండ్రుల ఆశయాలు నేరవేర్చుతూ ఉన్నత శిఖరాలకు చేరేవిధంగా కృషి చేయాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100కు కాల్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్‌న్స్‌ కౌన్సిల్‌ బానోత్‌ స్వామిదాస్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భగవద్గీత, వైస్‌ ప్రిన్సిపాల్‌ మంజుప్రద, అధ్యాపకులు నరేందర్‌, రామారావు, సారంగపాణి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement