● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క
సాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు.
తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ..
కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండేళ్లలో రామప్ప–లక్నవరం
కెనాల్ పూర్తయ్యేలా..
రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.


