ములుగు: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇంటింటికీ వచ్చే బూత్ స్థాయి అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లాలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ బీఎల్‌ఓలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబానికి ఎన్యూమరేషన్ ఫారమ్ అందజేస్తారని, కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, వయస్సు, చిరునామా, ఓటరు నమోదు సంబంధిత వివరాలను పరిశీలించి సరైన సమాచారం అందించాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే తొలగించడం, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్తగా అర్హత పొందిన ఓటర్లను చేర్చడం, తప్పులున్న వివరాలను సరిచేయడం వంటి ముఖ్యమైన ప్రక్రియలు ఈ కార్యక్రమంలో భాగమని తెలిపారు. జిల్లాలో 303 మంది బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరుగుతూ సమాచారం సేకరిస్తుండగా, వారి పనిని పర్యవేక్షించేందుకు 30 మంది సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కోసం 9 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు, మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక ఎన్నికల నమోదు అధికారి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎన్నికల సిబ్బందికి ప్రజలు అపోహలు లేకుండా పూర్తి వివరాలు అందించి సహకరించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


