అడుగంటిన జలాశయాలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన జలాశయాలు

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

ముఖం చాటేసిన వర్షాలు.. గణపసముద్రం నిండింది 40 శాతమే.. అడుగంటిన బొగ్గులవాగు ప్రాజెక్ట్‌.. సగం కూడా నిండని భీంఘన్‌పూర్‌

వానాకాలం సాగుపై రైతుల్లో ఆందోళన

జిల్లాలో వర్షాభావ పరిస్థితులే కారణం

జిల్లాలో ఈ నెలలో రెండు, మూడు రోజుల పాటే సాధారణ వర్షాపాతం నమోదైంది. వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటి వ్యవస్థ గొలుసుకట్టుగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. గణపసముద్రం నిండి మోరంచవాగు పారితేనే మూడు మండలాల రైతులకు నీరు అందుతుంది.. అయితే అక్కడ 40 శాతం నీరే ఉంది. అటు దేవాదుల ఎత్తిపోతల పథకానికి కీలకమైన భీంఘన్‌పూర్‌, బొగ్గులవాగు ప్రాజెక్టు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫలితంగా జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఎడారిగా మారుతాయేమోనని అన్నదాతలు భయపడుతున్నారు.

గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు సామర్థ్యం 380 మిలియన్‌ ఘనపు అడుగులు(ఎంసీఎఫ్‌టీ). ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి పరిమాణం 151 మిలియన్‌ ఘనపు అడుగులు మాత్రమే. ఇప్పటి వరకు 40 శాతం నీరు మాత్రమే చెరువులో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా 60 శాతం 229 ఎంసీఎఫ్‌టీ వస్తే చెరువు మత్తడిపోయనుంది. ఈ చెరువుపై ఆధారపడి మూడు మండలాల ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. గణపురం మండలంలో ప్రతీ ఏటా 4వేలకు పైగా ఎకరాల సాగు జరుగుతుండగా, చెరువు నిండాక మత్తడి పడి నీరంతా మోరంచవాగులో కలుస్తుంది. ఈ మోరంచవాగుపై ఆధారపడి భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన వేలాది మంది రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకుంటారు. గణపసముద్రంలో నీటి మట్టం అంతంత మాత్రంగానే ఉండటంతో మూడు మండలాల ప్రజలు తమ పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు.

మల్హర్‌ మండలంలోని ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని వరదనీరును వృథా కాకుండా ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే సదుద్ధేశంతో బొగ్గులవాగు మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టును 1976లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్హర్‌, కాటారం మండలాల్లోని సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 406.56 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం 80.10 ఎంసీఎఫ్‌టీ మాత్రమే నీరు నిల్వ ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ఈ ఏడాది వానాకాలం సాగుపై ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌తో పాటు ఇతర జిల్లాల రైతులకు సాగునీరు అందించాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్‌ అయిన భీంఘన్‌పూర్‌ భూపాలపల్లి మండలంలో ఉంది. ఈ రిజర్వాయర్‌ ద్వారా భూపాలపల్లి మండలంలోని రైతులకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్‌ పూర్తిగా నిండాక దేవాదుల మోటార్ల ద్వారా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు పంపింగ్‌ చేస్తారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకరంగా ఉంది. రిజర్వాయర్‌ సామర్థ్యం 380 ఎంసీఎఫ్‌టీ కాగా 151 ఎంసీఎఫ్‌టీ మాత్రమే నీటి నిల్వ ఉంది.

వానాకాలం సీజన్‌ ముంచుకొస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రధాన చెరువులు, రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల కాలం నాటి గణపసముద్రం కేవలం 40శాతం నీటికే పరిమితం కాగా.. బొగ్గులవాగు, భీంఘన్‌పూర్‌ రిజర్వాయర్లలో సగం కూడా నీరు లేకపోవడంతో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది.

– భూపాలపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement