అవయవదానం గొప్ప నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

అవయవదానం గొప్ప నిర్ణయం

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

ములుగు రూరల్‌: అవయవ దానం గొప్ప నిర్ణయమని సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవన్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ అవయమ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతలను ఆయన అభినందించారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా కుమారస్వామి–శైలజ దంపతులు అవయవ, శరీరదానం చేయడానికి ముందుకొచ్చి సదాశయ ఫౌండేషన్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు. అనంతరం ఫౌండేషన్‌ వారు దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ దళపతి, గౌరవ అధ్యక్షుడు పురుషోత్తం, సలహదారు లక్ష్మారెడ్డి, వరంగల్‌ అధ్యక్షుడు వేణుమాదవ్‌, కుమారస్వామి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

ములుగు రూరల్‌ : మండలంలోని జాకారం సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ములుగు ఎస్సై–2 చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. జాకారం సమీపంలో జాతీయ రహదారి పక్కన సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. మృతుడి శరీరంపై నీలం రంగు టీషర్ట్‌, తెలుపు రంగు ప్యాంటు, చేతికి మెటల్‌ ఆర్మ్‌రింగ్‌, చేతికి నల్లధారం, వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి. మృతదేహానికి పోలీసులు పంచనామా నిర్వహించి ములుగు జనరల్‌ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని ఎవరైన గుర్తించినా, అతడి సమాచారం తెలిసినా ములుగు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని, వివరాలకు 8712670081, 8712670111 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై పేర్కొన్నారు. కాగా, మృతుడి ముఖంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పీరీల ఊరేగింపు

కాళేశ్వరం: మహదేవపూర్‌, కాళేశ్వరంతో పాటు పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీరీలను డప్పుచప్పుళ్లతో వీధుల వెంట ఊరేగించారు. కులమత బేధాలు లేకుండా పీరీలకు మొక్కులు చెల్లించారు. కుడుకలు, పూల దండలు వేశారు. అనంతరం పీరీలను గోదావరిలో నిమజ్జనం చేశారు. గోదావరి వద్ద రొట్టెలు భక్తులకు పంపిణీ చేశారు.

జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్‌హోల్స్‌ పూర్తి

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బరాజ్‌లో ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సైంటిస్టుల బృందం చేపట్టిన జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్‌హోల్స్‌ శుక్రవారం పూర్తయ్యింది. మొత్తం 37 బోల్‌హోల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు బరాజ్‌ ఇన్‌చార్జ్‌ ఈఈ సురేష్‌ తెలిపారు. బరాజ్‌ పునరుద్ధరణ కోసం త్వరలో నివేదికలు అందజేస్తారని తెలిసింది.

పుట్టిన రోజే.. చివరి రోజు

ఈతకెళ్లి యువకుడి మృతి

జంపన్నవాగులో ఘటన

ఏటూరునాగారం : తన పుట్టిన రోజును స్నేహితులతో ఆనందంగా జరుపుకుందామని వచ్చిన ఓ యువకుడిని మృత్యువు నీటి రూపంలో కబలించింది. జంపన్న వాగులో ఈత కొడుతున్న క్రమంలో నీట మునిగి చనిపోయాడు. ఈ ఘటన శుక్రవారం ఏటూరునాగారం మండలం కొండాయి పంచాయతీ పరిధి కొండ్రెడు సమీపంలోని మేడిమంచె వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం కన్నెపల్లికి చెందిన పోలెబోయిన నారాయణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సాయికుమార్‌(21) ఉన్నారు. సాయికుమార్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు కన్నెపల్లికి వచ్చి తన స్నేహితులతో కలిసి మేడిమంచె వద్దకు చేరుకొని సరదాగా జంపన్నవాగులో ఈత కొట్టేందుకు దిగాడు. అయితే వాగులో లోతు ఎక్కువ ఉండడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు సాయికుమార్‌ కోసం వెతకసాగగా మూడు గంటల తర్వాత విగతజీవిగా కనిపించడంతో కన్నీమున్నీరుగా విలపించారు. ఈఘటనపై మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement