వరంగల్‌ ఓసిటీలో ప్లాట్ల వేలం | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ ఓసిటీలో ప్లాట్ల వేలం

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన ఏజే మిల్లు కార్మికుడు

17 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్రిక్తత

కాశిబుగ్గ: వరంగల్‌ ఓ సిటీలోని ప్లాట్ల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకులు ర్యాలీగా రావడం, ఓ కార్మికుడు ఏకంగా వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వరంగల్‌ ఓ సిటీలోని 98 ప్లాట్లకు అధికారులు శుక్రవారం ఉదయం వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి ముందే పలు కార్మిక సంఘాల నాయకులు పురాతన వాటర్‌ ట్యాంకు ప్రాంతం నుంచి ర్యాలీగా వేలం నిర్వహించే క్లబ్‌ వరకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆజంజాహిమిల్లు కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని, ప్లాట్ల వేలం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గద్దల సంజీవ అనే కార్మికుడు వాటర్‌ ట్యాంకు ఎక్కి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తర్వాత యశోద అనే కార్మికురాలితో పాటు మరో నలుగురు ట్యాంకు ఎక్కడానికి ప్రయత్నించారు. అలాగే, పోలీసులు పైకి రాకుండా ఉండేందుకు వాటర్‌ ట్యాంకు మెట్ల మధ్యలో టైరు కాల్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ట్యాంకుపై నుంచి దూకుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిరసనకారులను కిందికి దింపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ట్యాంకు వరకు ర్యాలీకి యత్నించారు. తాము కలెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవిస్తామని పోలీసులకు తెలిపారు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు కర్రె స్వామి, షూకూర్‌ ఆధ్వర్యంలో 17 మందిని పోలీసు వాహనం ఎక్కించి మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం యథాఽవిధిగా వేలం కొనసాగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement