ఏటూరునాగారం: ఓటరు జాబితా సమగ్ర సవరణలో ఆదివాసీలు ఓట్లు తొలగించవద్దని, గోదావరిలో డిసిల్టేషన్‌ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎండి దావూద్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్ మాట్లాడుతూ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా కార్యకర్తలు చూడాలన్నారు. కాంట్రాక్టర్ల లాభాల కోసమే గోదావరిలో ఇసుక తోడుతున్నారని తెలిపారు. వెంకటాపురం(కె) మండలం యాకన్నగూడెం నుంచి సుడిబాక వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించడంతో పాటు పాత పద్ధతుల్లోనే ఇసుక క్వారీలను కొనసాగించాలన్నారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. ఇసుక ద్వారా వచ్చే లాభాలను ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని గోదావరి నదిలో సుమారు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 4వేల ఎకరాల్లో సుమారు 3 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. దీంతో ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. తాగు, సాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకట రెడ్డి, రత్నం రాజేందర్, చిట్టి బాబు, రఘుపతి, వాసు, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, చిరంజీవి, దేవయ్య, చారి, దామోదర్, గపూర్, కిష్టయ్య, అశోక్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
రవికుమార్


