కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్‌ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్‌ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్..
ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్‌ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాలలో గైనిక్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న డాక్టర్ గీతాలక్ష్మికి ఆర్‌ఎంఓగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్ కోటాలో ఓబీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఆర్‌ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాల్లో ఆర్‌ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు వివరించినట్లు సమాచారం.


