జిల్లా వ్యాప్తంగా మండల విద్యాశాఖ అధికారులు ఇన్‌చార్జ్‌లే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూనే మండల విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించడంలో కొంత మేర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కలెక్టర్‌తో చర్చించి ఎంఈఓల ఎంఆర్‌పీలకు పరిమితం చేయాలని యోచిస్తున్నాం. గెజిటెడ్ హెచ్‌ఎంల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రస్తు తం ఖాళీగా ఉన్న ఆరు స్థానాలలో సీనియర్ టీచర్లకు హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించాం.
సిద్ధార్థరెడ్డి, డీఈఓ
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడం, ప్రైవేట్ పాఠశాలలు ఏ మేరకు నిబంధనలు అమలు చేస్తున్నాయో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు కరువయ్యారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతీ వారానికి 2 ప్రభుత్వ పాఠశాలలు, ఒక ప్రవేట్ పాఠశాలను తనిఖీ చేయాల్సి ఉంది. గెజిటెడ్ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించి రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని పలువురు కోరుతున్నారు.
10 మండలాలు.. 343 పాఠశాలలు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో మండల విద్యాశాఖ అధికారులు అందరూ ఇన్‌చార్జ్‌లే ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో మొత్తం 343 పాఠశాలలు ఉండగా అందులో 17,749 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఎంపీఎస్ పాఠశాలలు 246, యూపీఎస్ పాఠశాలలు 44, జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీవీబీ, టీజీఎంఎస్ 53 ఉన్నాయి. వీటితో పాటు 38 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల విధులు నిర్వహిస్తూనే మండల విద్యాశాఖ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో వారిపై అదనపు భారం పడుతుందనే చర్చ సాగుతోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది.
గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టుల ఖాళీలు..
జిల్లాలో మొత్తం 39 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 39 మంది గెజిటెడ్ హెచ్‌ఎంలకు బదులు 33 మంది మాత్రమే ఉన్నారు. ఆరు పాఠశాలల్లో గెజిటెడ్ హెచ్‌ఎంలు పదవీ విరణ పొందారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సుమారు 10 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడం, వారితో సమావేశాలు నిర్వహించి పాఠశాలల పురోగతిపై నివేదికలు ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. ఆరు పాఠశాలల్లో సీనియర్ టీచర్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అబ్బాపూర్, బండారుపల్లి, లక్ష్మీదేవిపేట, బీరెల్లి, కాటాపూర్, ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇన్‌చార్జ్ హెచ్‌ఎంలు కొనసాగుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎంఈఓల కొరత
గెజిటెడ్ హెచ్‌ఎంలకు
అదనపు బాధ్యతలు
పాఠశాలలపై కొరవడిన
పర్యవేక్షణ


