మంగపేట: ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాజుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క కలెక్టర్ సహదేవరావుతో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమానికి రాజుపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, నిమ్మగూడెం, దోమెడ, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు హాజరై సమస్యలపై దరఖాస్తులను అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారుకలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంగపేటలో బతుకమ్మ ఆట స్థలం చుట్టూ ప్రహరీ, హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి మహిళలు వినతిపత్రం అందజేశారు. అలాగే మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న ఎంపీడీఓ భవన కార్యాలయ నిర్మాణ మంత్రి శంకుస్థాపన చేశారు. రాజుపేట జెడ్పీ పాఠశాలలో సైన్స్‌ల్యాబ్ భవనాన్ని ప్రారంభించారు.


