నేటి నుంచి ఓటరు జాబితా
సవరణ ప్రక్రియ
షెడ్యూల్ ఇలా..
ములుగు: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రి య నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో గురువారం నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్‌ఓలు) తమ పరిధిలోని ప్రతీ ఇంటి కి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. 2002 ఓటరు జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా నమోదైనవారు తమ తల్లిదండ్రుల ఓటరు వివరాల ఆధారంగా లింక్ (మ్యాపింగ్) చేసుకునే అవకాశం ఉంది. మండలాల వారీగా బీఎల్వోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి సర్ కార్యక్రమానికి సన్నద్ధం చేశారు.
సర్వేలో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్తారు. ఆ ఇంట్లో 2002 జాబితా ప్రకారం ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతీ ఓటరుకు ఒక ఎన్యూమరేషన్ ఫాం అందిస్తారు. ఫాం ఇచ్చినట్లుగా వారి నుంచి ఎకనా లెడ్జ్‌మెంట్‌ను తీసుకుంటారు. ఆ ఫారాలను ఓటర్లే పూర్తి చేసి ఇవ్వాలి. ఓటర్లు నిరక్షరాస్యులైతే బీఎల్‌ఓలే ఫాం నింపుతారు. ప్రతీ బీఎల్‌ఓ తన పరిధిలో ని ప్రతీ ఇంటిని నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు సందర్శించాల్సి ఉంటుంది. ప్రతీ 10 మంది బీఎల్‌ఓల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. సూపర్‌వైజర్ల పనితీరును తహసీల్దార్లు పర్యవేక్షించనున్నారు.
2002 నాటి ఓటరు జాబితాలో ఓటరుగా పేరు లేని వారు తల్లిదండ్రుల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు వారు తమ తల్లి/తండ్రి 2002లో ఓటు హక్కు వినియోగించుకున్న అసెంబ్లీ నియోజకవర్గం– సంఖ్య, పోలింగ్ స్టేషన్ సంఖ్య, ఓటరుగా సీరియల్ నంబర్ వివరా లను ఎన్యూమరేషన్ ఫాంలో నమోదు చేయాలి. ఒకవేళ 2002లో లేకుండా 2025లో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉంటే వారు కూడా తమ తల్లిదండ్రులు ఓటరు సీరియల్ నంబర్ ఆధారంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్‌ఓలు ఇచ్చిన ఫారాలు తీసుకోకుంటే అర్హులైనప్పటికీ ఓటరు జా బితాలో పేరు కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాపా ర, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఎన్యూమరేషన్ సమయంలో విధిగా స్వగ్రామానికి చేరుకొని వివరాలు అందజేయాలి. ఎన్యూమరేషన్ ఫారాలు పొందని అర్హులైన ఓటర్లు జూలై 30 నుంచి ఆగస్టు 30 వరకు చేపట్టనున్న క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గడువులో వివరాలను అందజేయొచ్చు.
ములుగు నియోజకవర్గంలోని 10 మండలాల పరిధిలో 2,36,970 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,96,641 (82.98శాతం) మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్‌ఓను నియమించారు. ప్రతి 10 మంది బీఎల్‌ఓల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్ చొప్పున 32 మందిని జిల్లాలో నియమించారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫాం ద్వారా వివరాలు సేకరిస్తారు. సేకరించిన సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రతీ బీఎల్‌ఓ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను సరిచూసుకొని కొత్త ఓటర్ల నమోదు, మృతుల పేర్లు తొలగింపు, చిరునామాల మార్పులు చేసే అవకాశం బీఎల్‌ఓలకు కల్పించారు.
ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్
ఫాం అందజేత
2002లో పేరు లేకుంటే తల్లిదండ్రుల ఓటు ఆధారంగా లింక్
ములుగు నియోజకవర్గంలో
2,36,970 మంది ఓటర్లు
నేటి నుంచి జూలై 24 వరకు బూత్‌లెవల్ అధికారుల ఇంటింటి సర్వే
జూలై 31న ముసాయిదా ఓటరు
జాబితా ప్రచురణ
జూలై 31 నుంచి ఆగష్టు 30 వరకు
అభ్యంతరాల స్వీకరణ
ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు
నోటీసుల జారీ, పరిష్కారం
అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ


