దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

గోవిందరావుపేట/ములుగు రూరల్‌: గోవిందరావుపేట మండలంలోని చల్వాయి, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మాధవరావుపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్‌ ఆఫీసర్లు వెంకటలక్ష్మి, జీవన ప్రియ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. గోవిందరావుపేటలో పీజీసీఆర్‌టీ కెమిస్ట్రీ, సీఆర్‌టీ బయోసైన్స్‌ పోస్టులకు, ములుగులో పీజీసీఆర్టీ సివిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఎకానామిక్స్‌, బీఎస్సీ నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్థానికులైన అర్హత గల మహిళా అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో నేటి నుంచి 29వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలోపు చల్వాయి కేజీబీవీలో దరఖాస్తులు సమర్పించాలని సూచి ంచారు. ఇతర సమాచారం కోసం గోవిందరావుపేట అభ్యర్థులు 81869 12476 నంబర్‌ ద్వారా ములుగు అభ్యర్థులు 80086 18668 నంబర్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.

నేడు రాజుపేటలో ప్రజాదర్బార్‌

మంగపేట: మండలంలోని రాజుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు (గురువారం) ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ భద్రునాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు జరిగే ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవరావు వివిధ శాఖల అధికారులు హాజరవుతార ని తెలిపారు. కార్యక్రమానికి రాజుపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, నిమ్మగూడెం, దోమెడ, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు పాల్గొని సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై అర్జీలను సమర్పించాలని తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం పీఆర్‌టీయూటీఎస్‌ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డు సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేకపోతే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్‌, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.

టెండర్‌ ప్రక్రియ వాయిదా?

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ, తొలగింపునకు ప్రభుత్వం రూ.198కోట్లు కేటాయించగా ఏప్రిల్‌ 20న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న టెండర్‌ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడ్డట్లు సమాచారం. ఇప్పటికే ప్రకారాలు, మూలవిరాట్‌లను తొలగిస్తున్నారు. మరో వారం పాటు టెండర్‌ ప్రక్రియ కోసం వేచిచూడాల్సిందేనని తెలిసింది.

సమస్యలు

పరిష్కరించకుంటే సమ్మె

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో బుధవారం ఫిట్‌ కార్యదర్శి రాజేందర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి రక్షణకోసం కార్మికులంతా ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో నిర్వహించే చర్చల్లో 31 డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement