పని ఎక్కువ.. వేతనం తక్కువ | - | Sakshi
Sakshi News home page

పని ఎక్కువ.. వేతనం తక్కువ

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

నష్టాల్లో జీసీసీ బంకులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజన సంక్షేమం, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీడీఏ, జీసీసీ సంయుక్తంగా ఉమ్మడి జిల్లాలో 13 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేశాయి. పెట్రోల్‌ బంకుల్లో పనిచేస్తున్న ఆపరేటర్లు ప్రస్తుతం చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలంతా కష్టపడి పనిచేస్తున్నా అందుతున్న వేతనాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని వాపోతున్నారు. పెట్రోల్‌ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందిస్తూ పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు, నగదు లావాదేవీలు, స్టాక్‌ నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎండా.. వాన తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నా వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత కారణంగా అదనపు పనిభారం కూడా మోయాల్సి వస్తోందని వాపోతున్నారు. వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా జీతాలు చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత, ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

గిరిజనులకు ఉద్యోగావకాశాలు

ఏటూరునాగారం గిరిజన కోఆపరేటివ్‌ సోసైటీ(జీసీసీ) పరిధిలోని 5 బంకులు, ములుగులో 3, వెంకటాపూర్‌లో 1, నర్సంపేటలో 4 బంకులు ఉన్నాయి. ఈబంకుల్లో ఫిలింగ్‌ అపరేటర్లుగా 52 మంది గిరిజనులు పని చేస్తున్నారు. కాగా వారికి ఉద్యోగం ఉందన్న మాటే గాని వారి కుటుంబాలు మాత్రం సంతోషంగా లేవు. వారి వేతనాలు అతి తక్కువగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ప్రస్తుతం పెట్రోల్‌ ఆపరేటర్లకు నెలకు రూ.9,000 చెల్లిస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని కనీసం రూ.15వేలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు.

తాడ్వాయి మండల కేంద్రంలోని కామారం(పీటీ) బంక్‌లో నలుగురు గిరిజనులు ఫిలింగ్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. ఎనిమిది గంటలు పని చేయాల్సినవీరు 12 గంటల పని చేయడంతో అదనపు పని భారం పడుతుంది. బంక్‌లో స్వీపర్‌ కూడా ఏర్పాటు చేయలేదు. నైట్‌ వాచ్‌మెన్‌ కూడా లేరు. ఫిల్లింగ్‌ ఆపరేటర్లే మిగతా పనులన్నీ చేయాల్సిన పరిస్థితి. ఈ బంక్‌ మేడారం వెళ్లే దారిలో ఉండడంతో మేడారం దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

బంకులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు పెంచే అవకాశం లేదు. ఉద్యోగుల సమస్యలను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఉన్నాతాధికారులు వేతనాలపై పరిశీలిస్తారు.

– వాణి, జీసీసీ ఇన్‌చార్జ్‌ డీఎం

జీసీసీ పెట్రోల్‌ బంక్‌ ఆపరేటర్ల ఇక్కట్లు

చాలీచాలని వేతనాలతో అవస్థలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement