సవరణపై ప్రచారం నిర్వహించాలి
ములుగు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2026 (ఎస్‌ఐఆర్)పై జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అందిన ఆడియో, వీడియో ప్రచార సామగ్రిని అన్ని కమ్యూనికేషన్ మాద్యమాల ద్వా రా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రచారం ద్వారా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, అర్హత లేని పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రతీ అర్హుడైన ఓటరుకు సమాచారం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు.
తప్పుడు సమాచారంపై కఠిన చర్యలు తప్పవు
ఓటరు జాబితా స్వచ్ఛత, ఖచ్చితత్వాన్ని పరిరక్షించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్లు 17, 18, 31 నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు నిషేధమని, సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో పేరు నమోదు అయినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పుడు సమాచారం, నకిలీ పత్రాల సమర్పణ శిక్షార్హమైన నేరమని, సెక్షన్ 31 ప్రకారం ఓటరు నమోదు కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం, నకిలీ పత్రాలు సమర్పించడం, అసత్య ప్రకటనలు చేయడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


