క్రీడారంగంలో ములుగు సత్తా చాటుతోంది | - | Sakshi
Sakshi News home page

క్రీడారంగంలో ములుగు సత్తా చాటుతోంది

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ మంత్రి సీతక్క

ములుగు: క్రీడా రంగంలో ములుగు జిల్లా సత్తా చాటుతుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడి క్రీడాకారులు రాణిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగు ప్రభుత్వ హైస్కూల్‌ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, భారత ఒలింపిక్‌ సంఘం, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్‌ డే రన్‌– 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క హాజరై జ్యోతిని వెలిగించి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. క్రీడాకారుల కోసం అథ్లెటిక్స్‌ స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశ, విదేశాల్లో ములుగు ఖ్యాతిని చాటుతున్నారని తెలిపారు. పేదరికం, వెనుకబడిన పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని పిల్లల్లో ఉన్న ప్రతిభ అపారమని, వాలీబాల్‌, ఇతర క్రీడల్లో ములుగు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన చరిత్ర ఉందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అథ్లెటిక్స్‌ స్టేడియం ఏర్పాటు కోసం వచ్చిన ప్రతిపాదన మేరకు రూ.4 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయించామని, భవిష్యత్‌లో అవసరమైన అదనపు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకారిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు శారీరకంగా ధృడంగా ఉండటంతోపాటు క్రీడలపై పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఎస్పీ రవీందర్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ పగడాల వెంకటేశ్వర్‌ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఒలింపిక్‌ రన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement