సాక్షిప్రతినిధి, వరంగల్ : హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా గ్రేటర్ వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరింత బలపడేందుకు ఆ మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
కాంగ్రెస్: అధికార బలాన్ని
కేడర్ బలంగా మార్చే ప్రయత్నం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో తన పట్టు మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను కేడర్‌కు అప్పగిస్తున్నారు. ఇటీవల జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌లు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేడర్ సదస్సులు నిర్వహించిన జోష్ నింపారు. భవిష్యత్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులతో భారీ బహిరంగ సభలు, అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్: కోల్పోయిన బలాన్ని
తిరిగి సాధించే యత్నం
ఒకప్పుడు గ్రేటర్, ఉమ్మడి వరంగల్‌లో బలమైన ఆధిపత్యం చెలాయించిన బీఆర్‌ఎస్ ప్రస్తుతం తిరిగి కేడర్‌ను సమీకరించే పనిలో నిమగ్నమైంది. గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి టి.హరీష్‌రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి పనుల ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా లాభపడాలని పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదు, కేడర్ సమావేశాలు, సోషల్ మీడియా బలోపేతంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కేడర్‌ను ఉత్తేజపరిచారు.
బీజేపీ: ప్రత్యామ్నాయ శక్తిగా
ఎదగాలనే లక్ష్యం...
ఉమ్మడి వరంగల్‌లో తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈసారి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు, యువతపై ప్రత్యేక దృష్టితో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు సహా జాతీయ నాయకుల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 29న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు ఇటీవల ప్రకటించారు. మోదీ ప్రభుత్వ అభివద్ధి, కేంద్ర నిధులు, జాతీయత అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వరుస కార్యక్రమాలతో ఎన్నికల వేడి...
సభ్యత్వ నమోదు, బూత్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు, కేడర్ శిక్షణ శిబిరాలు, సోషల్ మీడియా విభాగాల బలోపేతం, యువత, మహిళా విభాగాల విస్తరణపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు వరుస కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాజకీయ పరిణామాలు ఉత్తర తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి పార్టీ గ్రేటర్ ఎన్నికలను కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోంది.
కేడర్‌తో సమావేశాలు..
సభ్యత్వ నమోదు.. శిక్షణ తరగతులు
బలపడేందుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు
‘గ్రేటర్’లో గెలుపే లక్ష్యంగా కసరత్తు
హైదరాబాద్ తర్వాత
కీలకంగా మారిన వరంగల్


