కరుణించిన వరుణుడు.. | - | Sakshi
Sakshi News home page

కరుణించిన వరుణుడు..

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

ములుగు: కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గతేడాది మే మాసంలోనే వర్షాలు కురిసినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. అయినప్పటికీ ఇటీవల కురిసిన చిరుజల్లులకు అన్నదాతలు పత్తి విత్తనాలు నాటి, బోర్ల కింద వరినార్లు పోశారు. ఈ నెల 22న ఆరుద్ర కార్తె ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గినప్పటికీ వర్షాలు పడలేదు. సోమవారం సాయంత్రం నుంచి మేఘాలు కమ్ముకున్నప్పటికీ మంగళవారం తెల్లవారుజామున మల్లంపల్లి మండలం మినహా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఆశించిన మేర వర్షం కురవడంతో రైతుల ఆశలు చిగురించాయి. సాగు చేసుకుంటున్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వ్యవసాయ పనులు ముమ్మరం చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి.

50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో 50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 మండలాలు ఉండగా మల్లంపల్లి మండలం మినహా మిగిలిన 9 మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం పడింది. వెంకటాపురం(ఎం)లో 68.8, ములుగులో 62.4, గోవిందరావుపేటలో 23.4, ఎస్‌ఎస్‌తాడ్వాయిలో 77.4, ఏటూరునాగారంలో 65.8, కన్నాయిగూడెంలో 45.2, వాజేడులో 26.2, వెంకటాపురం(కె)లో 68.6, మంగపేటలో 70.0 వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, వాజేడు మండలాల్లో వర్షపాతం తక్కువ నమోదైనప్పటికి మిగిలిన 7 మండలాల్లో కురిసిన వర్షంతో పంటల సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

10 మండలాలు..1,63,229 ఎకరాల్లో సాగు..

జిల్లాలోని 10 మండలాల పరిధిలో వానాకాలం సీజన్‌లో బోర్ల కింద వరినార్లు పోసి దుక్కులను సిద్ధం చేశారు. వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులను వేగిరం చేద్దామనుకున్న రైతాంగానికి మంగళవారం కురిసిన వర్షం ప్రాణం పోసింది. దీంతో పత్తి మొక్కలు మొలకెత్తనుండగా, రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేయనున్నారు.

సన్న రకాలకే మొగ్గు

ప్రభుత్వం సన్నరకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్‌ ఇస్తుందనే ఆశతో రైతులు సన్నరకం వరిపంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం 7 సన్న రకాలకు చెందిన వరి పంటలను సాగు చేస్తే బోనస్‌ క్వింటాల్‌కు రూ.500 అదనంగా అందిస్తామని ప్రకటించి, విత్తనాలను రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తుంది. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–15048, కేఎన్‌ఎం–1638, జైశ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్‌ 44, జేజీఎల్‌–1798 వరి వంగడాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్‌ అందించనుంది. సుమారు లక్ష ఎకరాల్లో సన్నరకం వరిపంట సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో పంటల సాగు

అంచనా వివరాలు (ఎకరాల్లో)

జిల్లా వ్యాప్తంగా కురిసిన మోస్తరు వాన

వరినారు, పత్తి మొక్కలకు ప్రాణం

వ్యవసాయ పనులకు

శ్రీకారం చుట్టిన రైతన్నలు

50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

1,07,700

11,329

28,600

15,600

పత్తి

మొక్కజొన్న

వరి

ఇతర పంటలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement